: హిందూ మహాసముద్రంలో చైనా పసిడి వేట
ఆసియా పెద్దన్న చైనా ముందుచూపు ప్రదర్శిస్తోంది. దేశ ప్రజలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు అక్కడి సర్కారు బంగారం, వెండి వంటి విలువైన ఖనిజాలు, అరుదైన ఖనిజ లవణాల కోసం ఇప్పటి నుంచే అన్వేషిస్తోంది. ఇలాంటి ఖనిజాలతో ఖజానాను నింపుకోవడమే చైనా సర్కారు లక్ష్యం. అందుకోసం హిందూ మహాసముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి చైనా నౌకలు, జలాంతర్గాములు. 120 రోజుల పాటు హిందూ మహాసముద్రంలో అన్వేషణ సాగించేందుకు జియావోలాంగ్ అనే జలాంతర్గామి తాజాగా రంగంలోకి దిగింది. పసిడితో పాటు హెడ్రోథర్మల్ ఫ్లూయిడ్, పాలీమెటాలిక్ సల్ఫైడ్, విశిష్టమైన శిలల తాలూకు నమూనాలను సేకరిస్తున్నట్టు ఈ మిషన్ కు నాయకత్వం వహిస్తున్న టావో చున్హుయి తెలిపారు. జియావోలాంగ్ సబ్ మెరైన్ ఇంతకుముందు ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలోనూ 52 రోజుల పాటు ఖనిజాల వేట సాగించింది. అందులో భాగంగా 116 రకాల బయోలాజికల్ శాంపిళ్లు, 22 రాతి నమూనాలు, 100 కిలోల కోబాల్ట్ క్రస్ట్, 24 కిలోల పాలీమెటాలిక్ క్రస్ట్, 1232 లీటర్ల సముద్ర జలాన్ని సేకరించింది. ఈ సందర్భంగా చైనీయులు సముద్ర గర్భంలో పరిశోధనకు లాంగ్ఝౌ అనే మానవరహిత వాహనాన్ని కూడా వినియోగించారు.