: తెలుగు రాష్ట్రాల్లో 18 మంది స్వచ్ఛ భారత్ దూతలు: వెంకయ్యనాయుడు
ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏదైనా సాధించగలమని చెప్పారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ కు ప్రచారకర్తలుగా ఎంపికైన వారితో వెంకయ్యనాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలు ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలని కోరారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని చెప్పారు. స్వచ్ఛ భారత్ కు సంబంధించి సినీనటులు, క్రీడాకారులు, ఆధ్యాత్మిక గురువులు, స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడామని వెంకయ్య తెలిపారు. స్వచ్ఛ భారత్ ప్రచారకర్తల్లో పవన్ కల్యాణ్, టీఆర్ఎస్ ఎంపీ కవిత, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, రామేశ్వరరావు, జీవీకే రెడ్డి, కోనేరు హంపి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అక్కినేని అమల, నితిన్, సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ జీఎన్ రావు తదితరులు ఉన్నారు. మొత్తం 18 మంది ప్రముఖులు స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలుగా ఎంపికయ్యారు.