: దయచేసి నాపై సానుభూతి చూపకండి: శ్వేతబసు ప్రసాద్
తన జీవితంలో మరువలేని వివాదంతో గతేడాది వార్తల్లో నిలిచిన కథానాయిక శ్వేతబసు ప్రసాద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతం కెరీర్ పై దృష్టిపెట్టిన ఆమెను తాజాగా ఓ ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతో ధైర్యంగా మాట్లాడింది. ప్రతి ఒక్కరూ తనపై విపరీతమైన సానుభూతిని ఒలకబోస్తున్నారని, దయచేసి సానుభూతి చూపవద్దని కోరుకుంది. తనపై అత్యాచారం జరగలేదని, తాను కనీసం బాధితురాలిని కూడా కాదని తెలిపింది. జరిగిన సంఘటన మంచిది కాదని తనకూ తెలుసని, అంత సాధారణమైన విషయం కూడా కాదని చెప్పింది. కానీ ఆ ఘటన తనకో పెద్ద జీవిత పాఠమని శ్వేత తెలిపింది. రెస్క్యూ హోమ్ నుంచి విడుదలయ్యాక తాను మానసికంగా బలపడ్డానంది. ప్రస్తుతం తాను 'రూట్స్' అనే క్లాసికల్ మ్యూజిక్ కు సంబంధించిన డాక్యుమెంటరీపై పనిచేస్తున్నానని వెల్లడించింది. ఇక దర్శకుడు హన్సల్ మెహతా ఇచ్చిన సినిమా ఆఫర్ కు సంబంధించి ఏదీ ఖరారు కాలేదని వివరించింది. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా తనకు ఓసారి మెసేజ్ చేశారని, అందరితో కలుపుగోలుగా ఉండాలని సూచించారని తెలిపింది. తాను కూడా ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాని శ్వేత చెప్పింది.