: భూముల క్రమబద్ధీకరణతో... టీ సర్కారు రూ.15 వేల కోట్ల రాబడి
భూములను క్రమబద్ధీకరించడంతో పాటు వేలం వేయడం ద్వారా భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దురాక్రమణలకు గురైన సర్కారీ భూములను గుర్తించడం, క్రమబద్ధీకరణ, వేలం ద్వారా సర్కారీ ఖజానాకు ఏకంగా రూ.15 వేల కోట్ల మేర ఆదాయం చేరనుందని సాక్షాత్తు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెబుతున్నారు. సర్కారీ భూముల అన్యాక్రాంతంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కొరడా ఝుళిపించారు. సదరు భూముల అన్యాక్రాంతంపై అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన కేసీఆర్ భూములను పునఃస్వాధీనం చేసుకోవడంతోపాటు దురాక్రమణదారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సర్కారీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిలో కొన్ని భూములను మాత్రమే వేలం వేయనున్నట్లు, దీని ద్వారా ఖజానాకు రూ.15 వేల కోట్లను సమకూర్చనున్నట్లు ఆదివారం నాటి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో రాజీవ్ శర్మ చెప్పారు.