: తూచ్... బీజేపీ నేతకు టికెట్ ప్రకటించిన ఆప్!
ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలోనే తడబడింది. గడచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో దేశాన్ని నివ్వెరపరచిన ఆ పార్టీ, ఫిబ్రవరిలో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికలకు సంబంధించి తొట్రుపాటుకు గురవుతోంది. మొన్నటికి మొన్న 'బీజేపీ సీఎం అభ్యర్థి ఇతనే' అంటూ ఓ నేత పేరును ప్రకటించి వివాదానికి తెరతీసిన ఆ పార్టీ, తాజాగా బీజేపీ అభ్యర్థికి టికెట్ ప్రకటించి ఢిల్లీ ఓటర్లతో పాటు బీజేపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీలోని వజీర్ పూర్ నియోజకవర్గానికి తన అభ్యర్థిగా బీజేపీ నేత సురేష్ భరద్వాజ్ పేరును ప్రకటించింది. తీరా విషయం తెలుసుకుని నాలిక్కరుచుకున్న ఆ పార్టీ అధిష్ఠానం ఆ పేరు రద్దు చేసి, సంజయ్ సింగ్ అక్కడి నుంచి బరిలో నిలుస్తారని తెలిపింది. ఈలోగా భరద్వాజ్ ను కలిసిన కొందరు శుభాకాంక్షలు తెలపగా, మరికొందరు ఆప్ లో ఎప్పుడు చేరారంటూ ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకున్న భరద్వాజ్ కూడా కంగుతిన్నారు. అయితే, ఈ విషయాన్ని అంత సీరియస్ గా ఏమీ తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ సీనియర్లు తన వైపు అనుమానపు చూపులు చూశారని వార్తలు వినిపించినా, వాటినేమీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం రాలేదని కూడా భరద్వాజ్ చెప్పుకొచ్చారు.