: వాస్తవాలను వక్రీకరించొద్దు: పాక్ ప్రధాని సలహాదారుకు సుష్మా ఘాటు లేఖ
పాకిస్థానీ రేంజర్ల హతం విషయంలో ఆ దేశ వాదనను భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాక్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆధారాలతో తేల్చేశారు. అసలు విషయాలను ప్రస్తావించిన సుష్మా, పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ రాసిన లేఖకు ఘాటుగా సమాధానమిచ్చారు. చర్చలకు పిలిచి తమ దేశ సైనికులిద్దరిని భారత సైన్యం హత్య చేసిందని ఆరోపిస్తూ ఈ నెల 2న అజీజ్, సుష్మాకు లేఖ రాశారు. డిసెంబర్ 31న జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనపై భారత సైన్యం నుంచి సమగ్ర వివరాలను సేకరించిన సుష్మా, నిన్న అజీజ్ లేఖను తూర్పారబడుతూ ఘాటు వ్యాఖ్యలతో లేఖ రాశారు. ‘ఆ రోజు పాక్ కు చెందిన ఓ జెండా మా భూభాగంలో కనిపించింది. దానిని పరిశీలించేందుకు వెళ్లిన మా సైనికులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మా సైనికుడొకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం మా సైన్యం జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడండి’’ అంటూ సుష్మా తన లేఖలో అజీజ్ తీరును ఖండించారు.