: టీవీ చర్చ ‘చిచ్చు’: బీజేపీ, ఆప్ ల మధ్య ఘర్షణ... 12 మందికి గాయాలు, కారు ధ్వంసం
పొద్దున లేస్తే టీవీ తెరలపై వాడీవేడీ చర్చలు. అవసరమైన, అనవసరమైన అంశాలపై ఎడతెగని భేటీలు. సహనం కోల్పోతున్న నేతాశ్రీలు ప్రజా సమస్యలను వదిలేసి వ్యక్తిగత ఆరోపణలకూ దిగుతున్నారు. అంతేకాక ప్రశ్నలు సంధించే వ్యాఖ్యాతలపైనా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఇదే తరహాలో శనివారం డిల్లీలోని తుగ్లకాబాద్ పరిధిలో జరిగిన ఓ టీవీ చర్చ భారీ ఘర్షణకే దారి తీసింది. చర్చలో పాల్గొన్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య నెలకొన్న వ్యక్తిగత దూషణలు ఆ పార్టీల కార్యకర్తల మధ్య ప్రత్యక్ష యుద్ధానికీ కారణమైంది. ఈ ఘర్షణలో 12 మందికి గాయాలు కాగా, ఆప్ నేత సహీ రామ్ కారును బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. అనంతరం ఇరువర్గాలు గోవింద్ పురి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈ ఘర్షణలో గాయపడ్డ వారిలో బీజేపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.