: జగన్ కు షాకిచ్చి బీజేపీలోకి వెళుతున్న కందుల సోదరులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. పలువురు అసంతృప్త నేతలు ప్రస్తుత అధికార పార్టీల్లోకి వెళుతున్నారు. తాజాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో కందుల సోదరులు ఝలక్ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. వైసీపీకి ఇక భవిష్యత్ లేదని, అందుకే బీజేపీలోకి వెళుతున్నట్లు మీడియా ముందు ప్రకటించారు. ఇక నుంచి కడపలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని రాజమోహన్ రెడ్డి తెలిపారు. మరోవైపు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా కొంతకాలం నుంచి జగన్ కు దూరంగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మీడియా ముందు ప్రకటించారు. పార్టీ అధినేతతో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. జగన్ తీరు నచ్చకే దూరంగా ఉంటున్నానని, మధ్యవర్తులు రాజీ ప్రయత్నం చేసినా వెళ్లలేదని చెప్పారు. అయితే, తాను బీజేపీలోగానీ, టీడీపీలోగానీ చేరవచ్చన్నది అవాస్తవమని తెలిపారు.