: నదీ జలాల విషయంలో ఏపీ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది: మంత్రి హరీశ్ రావు
కృష్ణానదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి తాము చాలా ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ, ఏపీ మాత్రం సహకరించడం లేదన్నారు. ఈ మేరకు సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రి హరీశ్ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీని చర్చలకు పిలిస్తే కృష్ణా బోర్డుకు లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. నాగార్జునసాగర్ లో 550 టీఎంసీలు మాత్రమే మిగులుతాయని, అందులో తెలంగాణ వాటా 229 టీఎంసీలని వివరించారు. ఏపీ అదనంగా వాడుకున్న నీరు కాకుండా మళ్లీ 40 టీఎంసీలు అడుగుతోందని పేర్కొన్నారు. అంతేగాక, సాగర్ లో ఉన్న 101 టీఎంసీల నీరు కూడా ఏపీ కావాలంటోందన్నారు. అన్ని వాస్తవాలతో బోర్డుకు తాము కూడా లేఖ రాస్తామని చెప్పిన మంత్రి, ఏపీ సర్కారు తెలంగాణ రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.