: టీమిండియా వైస్ కెప్టెన్ గా ఇషాంత్ శర్మ?


ఆసీస్ తో చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దీంతో, వైస్ కెప్టెన్ ఎవరు? అనేది భారత క్రికెట్ లో ఆసక్తి రేపుతున్న చర్చ. దీంతో పలువురి పేర్లు వైస్ కెప్టెన్ రేసులో చక్కర్లు కొడుతున్నాయి. వైస్ కెప్టెన్ గా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, టాపార్డర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా, 23 టెస్టులాడినప్పటికీ అశ్విన్ కు తుది జట్టులో చోటుదక్కడం అనుమానమే. రహానే వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, జట్టులో నమ్మదగిన బ్యాట్స్ మన్ గా ఎదిగాడు. అయితే, తాజాగా, టీమిండియా టాప్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫేస్ బుక్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వైస్ కెప్టెన్ గా నియమితుడైనందుకు సహచరుడు ఇషాంత్ శర్మకు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు. దీంతో మరో చర్చకు తెరలేచినట్టయింది. అశ్విన్, రహానేలను కాదని వైస్ కెప్టెన్సీ ఇషాంత్ కు కట్టబెట్టారా? అంటూ క్రికెట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అన్నట్టు... ఇషాంత్, కోహ్లీ ఇద్దరూ ఢిల్లీ ఆటగాళ్లే.

  • Loading...

More Telugu News