: కోహ్లీకి పట్టం కట్టిన నెటిజన్లు


టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి నెటిజన్లు పట్టం కట్టారు. ఏ విషయంలో అనుకుంటున్నారా? ఇటీవల ఆస్ట్రేలియా వెబ్ సైట్ news.com.au ఓ ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఈ వారం 'అతిపెద్ద క్రీడా సంచలనం' ఎవరంటూ ఆన్ లైన్ లో ప్రశ్నించింది. దీనికి అత్యధికులు విరాట్ కోహ్లీకి ఓటేశారట. ఈ పోల్ లో మనవాడికి 56.15 శాతం ఓట్లు లభించాయి. కోహ్లీకి లభించిన ఓట్ల సంఖ్య 346 కాగా, అతని తర్వాత సౌదీ అరేబియా సాకర్ క్రీడాకారుడు నాజర్ అల్-షమ్రానికి 128 ఓట్లు దక్కాయి. అమెరికన్ రగ్బీ ఆటగాడు ఎన్దముకాంగ్ సు 82 ఓట్లు, చెల్సియా క్లబ్ సాకర్ స్టార్ గారీ కాహిల్ 51 ఓట్లు పొందారు. కాగా, మెల్బోర్న్ టెస్టు సందర్భంగా కోహ్లీని లక్ష్యంగా చేసుకుని ఆసీస్ ఆటగాళ్లు మాటల తూటాలు పేల్చడం తెలిసిందే. అయితే, కంగారూల స్లెడ్జింగ్ కు కోహ్లీ అటు నోటితోనూ, ఇటు బ్యాటింగ్ తోనూ బదులివ్వడం ఆసీస్ మీడియాను ఆకర్షించింది. డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్ లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో 169, రెండో ఇన్నింగ్స్ లో 54 పరుగులు సాధించడం విశేషం. టెస్టు జరిగినన్ని రోజులూ ఏదో ఒక సందర్భంలో కోహ్లీ, ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ జాన్సన్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం గమనార్హం. ఆసీస్ ఆటగాళ్ల ప్రవర్తన గురించి కోహ్లీ మాట్లాడుతూ, వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ తనను 'చెడ్డ బాలుడు' అని కామెంట్ చేసేవాడని తెలిపాడు. అయితే, వారు అలా పిలిచిన ప్రతిసారి తనలో పట్టుదల పెరిగేదని, తద్వారా, తన అత్యుత్తమ ఆట బయటికి వచ్చేదని తెలిపాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తనను ద్వేషించడాన్ని ఇష్టపడుతున్నానని, జాన్సన్ కు గౌరవం ఇచ్చేదిలేదని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News