: సీఎం అఖిలేశ్ యాదవ్ 'పీకే' డౌన్ లోడ్ వివాదం!


'పీకే' చిత్రాన్ని డౌన్ లోడ్ చేసి చూశానంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చెప్పడం సామాజిక మీడియాలో వివాదాస్పదమైంది. డిసెంబర్ 31న ప్రెస్ కాన్ఫరెన్స్ లో అఖిలేశ్ మాట్లాడుతూ, "'పీకే' చూడమని చాలా రోజులుగా పలువురు నాకు చెబుతున్నారు. అందుకే కొన్ని రోజుల కిందట డౌన్ లోడ్ చేశాను, కానీ గత రాత్రి నాకు సమయం దొరకడంతో సినిమాను చూశాను. చాలా బాగా నచ్చింది. ప్రజలు కూడా చూడాలని వెంటనే పన్ను రాయితీ కల్పించాలని నిర్ణయించుకున్నా" అని తెలిపారు. ఆ తరువాత ఆయనపై ట్విట్టర్ లో పైరసీ మాటల దాడి మొదలైంది. "పైరసీ వ్యతిరేక చట్టాలు చాలా ఉన్నాయి!" అని ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో "'పీకే'ను డౌన్ లోడ్ చేసి, చూసిన అఖిలేశ్ యాదవ్ పైరసీకి మద్దతు పలుకుతున్నారు. ఓ చిత్రాన్ని డౌన్ లోడ్ చేయడం తీవ్రమైన నేరం. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కచ్చితంగా చర్యలు తీసుకోవాలి" అని వ్యాఖ్యానించారు. దాంతో జరిగిన నష్టాన్ని నియంత్రించేందుకు అఖిలేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఉదయం ఓ ట్వీట్ చేసింది. "అఖిలేశ్ యాదవ్ కు '@యుఎఫ్ఓమూవీజడ్' డీజీ ఫెసిలిటీ లైసెన్స్ ఉంది. అందులోనే డౌన్ లోడ్ చేసుకుని, మూవీ చూశారు" అని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News