: ధోనీ, కోహ్లీ మధ్య విభేదాల్లేవు: రవిశాస్త్రి
విరాట్ కోహ్లీతో విభేదాలే ధోనీ రిటైర్మెంటుకు కారణమని వస్తున్న కథనాలపై టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి స్పందించాడు. ధోనీ, కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాడు. "కోహ్లీయే కాదు, సహాయక సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సహా జట్టులోని ప్రతి ఒక్కరు ధోనీ ఆజ్ఞలను గౌరవిస్తారు. ధోనీ, కోహ్లీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనుకోలేదు. ఇదంతా నాన్సెన్స్" అని తెలిపాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని ధోనీ తీసుకున్న నిర్ణయం జట్టునంతటినీ ఆశ్చర్యానికి గురిచేసిందని, పిడుగుపాటులా భావించామని చెప్పాడు. అయితే, తాను అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు శాస్త్రి పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత వ్యవహారమని, అత్యుత్తమ క్రీడాకారులకు తాము ఎప్పుడు నిష్క్రమించాలో తెలుసని అన్నాడు. ఆ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నిస్తారని అన్నారు. అతనేమీ 100 టెస్టుల రికార్డు, ఇతర గణాంక ఘనతల కోసం వేచి చూడలేదని, ఘనమైన వీడ్కోలు కోరుకోలేదని పరోక్షంగా సచిన్ కు చురకవేశాడీ ముంబైవాలా.