: ఆర్టీసీలో విభజన సెగ: రీజనల్ మేనేజర్ పై దాడి?
ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడిపోయినా ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతోంది. ప్రత్యేక, సమైక్య ఉద్యమాల సందర్భంగా ఆయా శాఖల్లో అధికారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే, తాజాగా ఆర్టీసీలో విభజన సెగలు ఎగసిపడ్డాయి. హైదరాబాద్ లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లోని టాయిలెట్ లో రెండు రోజుల క్రితం రీజనల్ మేనేజర్ సత్యనారాయణకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నప్పటికీ విభజన సెగ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగి ఉంటుందని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నెలరోజుల్లో విభజన ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్న తరుణంలో ఉద్యోగుల పంపిణీపై రాజుకున్న వివాదమే ఆయనపై దాడికి కారణమని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిసిన మండలాలకు చెందిన ఓ వ్యక్తి సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే విభజన నేపథ్యంలో సదరు డైరెక్టర్ తమకొద్దంటే తమకొద్దని ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగుల మధ్య వాదన జరిగిందట. ఈ నేపథ్యంలోనే ఆర్ఎం సత్యనారాయణపై దాడి జరిగిందని విశ్వసనీయ సమాచారం.