: చంద్రబాబూ... కడప జిల్లాను అవమానిస్తూ మాట్లాడటం సరికాదు: తులసిరెడ్డి
కడప, కర్నూలు జిల్లాల రౌడీయిజాన్ని కొత్త రాజధాని తుళ్లూరులో ప్రవేశపెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, దాన్ని సహించేది లేదని, ఖబడ్దార్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలను మాజీ ఎంపీ తులసిరెడ్డి తప్పుబట్టారు. కడప జిల్లా మొత్తాన్ని అవమానించేలా చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి పూర్తిగా అంతరించిపోయిందని చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం, కడప గాంధీగా పేరొందిన కడప కోటిరెడ్డిలు కడప జిల్లా వాసులే అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచించారు. కడపలో కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారని, ఒకప్పుడు జిల్లాలో టీడీపీకి మెజార్టీ సీట్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన తులసిరెడ్డిది కూడా కడప జిల్లానే.