: మీ స్థలంపై మీకే సర్వహక్కులు... సొసైటీ పేరిటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పట్టా: కేసీఆర్
ఇకపై నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ స్థలంపై సర్వహక్కులు ఎగ్జిబిషన్ సొసైటీవే. ఆ స్థలం యాజమాన్య హక్కులను సొసైటీకే కల్పిస్తూ, సొసైటీ పేరిటే స్థలం పట్టాను ఐదు రోజుల్లోగా జారీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ విస్పష్ట ప్రకటన చేశారు. గురువారం ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే మెరుగైన రీతిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పేద విద్యార్థులకు విద్యనందించే క్రమంలో నగరంలో పలు కళాశాలలను నిర్శహిస్తున్న సొసైటీకి మరింత దన్నుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సొసైటీకి అన్ని రకాలుగా సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.