: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సాధారణ భక్తుల్లో చాలా మంది ఇంకా క్యూ లైన్లలోనే ఉన్నారు. నిన్నటి నుంచి క్యూ లైన్లలోనే ఉన్న భక్తులకు నేటి దాకా వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం లభించలేదు. నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో రెండు రోజుల క్రితం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో తీవ్ర రద్దీ నెలకొంది. వెంకన్న దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చి, లైన్లలో పడిగాపులు గాస్తున్న తమను కాదని, వీఐపీ భక్తులకు దర్శనాన్ని కల్పించడంపై భక్తులు టీటీడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. భక్తుల ఆగ్రహావేశాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా వాయిదా వేసిన టీటీడీ సాధారణ భక్తుల దర్శనానికే ప్రాధాన్యతనిచ్చింది. అయినా నేటి ఉదయం దాకా భక్తుల రద్దీ తగ్గలేదు. తిరుమలకు ఇంకా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది.