: సొంత నావిగేషన్ సిస్టమ్ దిశగా భారత్
భూమండలంపై ఏ ప్రాంతాన్నైనా లొకేట్ చేయడం, వాతావరణ సమాచారం అందించడం తదితర అంశాలతో కూడిన 'జీపీఎస్' గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అమెరికా ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కొన్ని శాటిలైట్ల ఆధారంగా పనిచేస్తుంది. ఓ జీపీఎస్ రిసీవర్ ఉంటే చాలు సాధారణ, వాణిజ్య, సైనిక వినియోగదారులు ఉచితంగా ఎంతో సమాచారం పొందవచ్చు. ఇప్పుడీ వ్యవస్థకు దీటుగా భారత్ కూడా సొంత నావిగేషన్ సిస్టమ్ రూపకల్పనకు రంగంలో దిగింది. ఇండియన్ రీజినల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ (ఐఆర్ఎస్ఎన్ఎస్) పేరిట ప్రవేశపెట్టే ఈ వ్యవస్థ ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందని ఇస్రో చైర్మన్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా రెండు రకాలు సేవలు అందిస్తామన్నారు. పౌర సేవలు, మిలిటరీ సేవలు అందుబాటులోకి వస్తాయని, అయితే, మిలిటరీ సేవలు పౌరులకు నిషిద్ధమని వెల్లడించారు. అనుమతి ఉన్న వినియోగదారుల (సైన్యం) కోసం ఆ సేవలు ప్రత్యేకించామని వివరించారు. 36,000 కిలోమీటర్ల ఎత్తున 7 శాటిలైట్లను మోహరించడం ద్వారా ఐఆర్ఎస్ఎన్ఎస్ ను అందుబాటులోకి తెస్తామని రాధాకృష్ణన్ చెప్పారు.