: యాంటీ టెర్రర్ ఆపరేషన్ల లైవ్ కవరేజీ నిషేధించాలంటున్న హోం శాఖ
టెర్రరిస్టు వ్యతిరేక ఆపరేషన్లను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించాలని కేంద్ర హోం శాఖ కోరుతోంది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. నిషేధం విధించేందుకు వీలుగా కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలను సవరించాలంటూ లేఖలో విజ్ఞప్తి చేసింది. దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు పెదవి విప్పడంలేదు. ఈ విషయం పరిశీలనలో ఉందని మాత్రమే అంటున్నారు. 26/11 ముంబై దాడుల సందర్భంగా ఎన్ఎస్ జీ ఆపరేషన్లను వార్తా చానళ్లు లైవ్ గా అందించాయని హోం శాఖ తెలిపింది. ఇలాంటి కవరేజి ఆపరేషన్ గోప్యత, తీవ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆపరేషన్ లో పాల్గొంటున్న భద్రత బలగాలు, పౌరులు, పాత్రికేయుల రక్షణను సైతం అనిశ్చితిలో పడేస్తుందని హోం శాఖ ఆందోళన వెలిబుచ్చింది. కాగా, యూపీఏ హయాంలో అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి ఆనంద్ శర్మ నిషేధం కోసం ప్రయత్నించినా అది కార్యరూపం దాల్చలేదు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిషేధంపై నిర్ణయం తీసుకునేందుకు ముందడగు వేయలేకపోయారు.