: తిరుమలలో విపరీత రద్దీ... ఏర్పాట్లపై అధికారులతో భక్తుల వాగ్వాదం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ రద్దీ నెలకొంది. కొత్త సంవత్సరాదిన వైకుంఠ ఏకాదశి రావడంతో భారీ స్థాయిలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచే తిరుమల భక్తులతో నిండిపోయింది. నేటి తెల్లవారుజామున 3.15 గంటలకు సర్వదర్శనాన్ని ప్రారంభించిన టీటీడీ, ఆ తర్వాత రెండు గంటల సమయాన్ని వీఐపీ భక్తులకు కేటాయించింది. దీంతో సామాన్య భక్తులు భగ్గుమన్నారు. వీఐపీ దర్శనాల నేపథ్యంలో, స్వామి వారి దర్శనంలో తమకు జాప్యం జరుగుతోందంటూ అధికారులతో పాటు పోలీసులతోనూ భక్తులు వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగని సామాన్య భక్తులు వీఐపీ భక్తుల వాహనాలను అడ్డుకున్నారు. దీంతో దాదాపు కిలో మీటర్ల మేర వీఐపీ వాహనాలు నిలిచిపోయాయి. సాధారణ భక్తుల ఆందోళనల నేపథ్యంలో తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.