: ఆలయాలలో భక్త జన సందోహం... తిరుమలలో నానా ఇబ్బందులు పడుతున్న భక్తులు
నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తజన సందోహం నెలకొంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏపీ పరిధిలోని తిరుమల, శ్రీశైలం సహా మహానంది ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరాది ఒకే రోజు కావడంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడిని ముందే పసిగట్టిన టీటీడీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినా, భక్తులకు ఏమాత్రం సరిపోలేదు. దీంతో రోడ్లపైనే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. భక్తులు స్వామి వద్దకు వెళ్లే క్రమంలో అధిక తాకిడి చోటు చేసుకోవడంతో క్యూ కాంప్లెక్స్ బారికేడ్లు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇటీవల అత్యంత ప్రాచుర్యం లభిస్తున్న ఆలయాలు భద్రాచలం, యాదగిరిగుట్టలకు భక్తులు పోతెత్తారు. బుధవారం సాయంత్రం భద్రాచలంలో జరిగిన శ్రీసీతారామస్వామి తెప్పోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.