: బీబీసీ మాజీ యాంకర్ ను రహస్యంగా పెళ్లాడిన ఇమ్రాన్ ఖాన్!
మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ బీబీసీ టీవీ మాజీ యాంకర్ రెహామ్ ఖాన్ ను రహస్యంగా వివాహం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 62 ఏళ్ల ఇమ్రాన్, 41 ఏళ్ల రెహామ్ పెళ్లి చేసుకున్నట్టు పాక్ మీడియాలో జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. వివాహిత అయిన ఆమెకు ముగ్గురు పిల్లలుండగా, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. పాకిస్థాన్ కు చెందిన రెహామ్ బీబీసీలో వాతావరణ వార్తల యాంకర్ గా పనిచేసిన సమయంలో కొంతకాలం బ్రిటన్ లో నివసించింది. అప్పుడే ఇమ్రాన్ తో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇటు ఇమ్రాన్ తన భార్య జెమిమా గోల్డ్ స్మిత్ కు పదేళ్ల కిందటే విడాకులు ఇచ్చాడు. అనంతరకాలంలో యాంకర్ తో పరిచయం కావడం, అది కాస్తా ప్రేమకు దారి తీయడంతో తాజాగా గుట్టుచప్పుడు కాకుండా ఒక్కటయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంతవరకు ఇమ్రాన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ప్రముఖ యాంకర్ జావెద్ రబ్బానీ ఈ నెల 27న ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "ఓ యాంకర్ ఓ రాజకీయ నాయకుడిని ఈ రోజు పెళ్లి చేసుకుంది" అని ట్వీట్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ వివాహం ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలుస్తోంది.