: కేవలం రెండు నిమిషాలు... 162 మంది ప్రాణాలు... అసలేం జరిగింది?
కేవలం రెండంటే రెండే నిమిషాల ఆలస్యం 162 మంది ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఎయిర్ ఏషియా విమానం నడిసముద్రంలో కుప్పకూలిపోవడానికి కారణాలు వెలుగులోకి వచ్చాయి. పైలట్ కు ఏటీసీకి మధ్య జరిగిన సంభాషణ వివరాలు వెల్లడయ్యాయి. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా క్యూ జెడ్ 8501 విమాన పైలట్ కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మధ్య జరిగిన సంభాషణలు ఎలా సాగాయంటే... వాతావరణం ఏమాత్రం బాగాలేదు కనుక తాను ఎడమవైపుకు తిరిగి మరింత ఎత్తుకు వెళతానని పైలట్ ఏటీసీకి సమాచారం అందించాడు. దీనికి ఏటీసీ ఆపరేటర్లు ఆమోదించడంతో పైలట్ ఎడమ వైపుకు తిరిగి మరింత ఎత్తుకు వెళ్లాడు. అలా సుమారు ఏడు మైళ్ల దూరం ప్రయాణించింది. అయినప్పటికీ విమానం సజావుగా వెళుతున్నట్టు కనపడలేదు. దీంతో పైలట్ ఇర్యాంటో మరోసారి ఏటీసీని సంప్రదించాడు. వాతావరణం సహకరించడం లేదు కనుక తాను మరింత ఎత్తులో వెళ్లానుకుంటున్నానని తెలిపాడు. దీంతో, ఏటీసీ అధికారులు ఎంత ఎత్తులో వెళ్లాలనుకుంటున్నారని అడిగారు. దీనికి 38 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళతానని చెప్పాడు. దానికి ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వెంటనే సమాధానం చెప్పలేదు. దీనికి కారణం ఆ ఎత్తులో మరో ఆరు విమానాలు ఎదురుగా వస్తున్నాయి. ఏమాత్రం పొరపాటు తలెత్తినా పెను ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకే వారు ఉన్నతాధికారులను సంప్రదించారు. రెండు నిమిషాల పాటు తర్జనభర్జన పడిన అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు "సరే ఎత్తులో వెళ్లండి" అంటూ ఆదేశాలిచ్చారు. కానీ విమానం నుంచి సమాధానం రాలేదు. ఎందుకంటే విమానం అప్పటికే ప్రమాదానికి గురైంది. దాంతో, 162 మందీ జలసమాధి అయ్యారు.