: సరిహద్దు దాటిన బాలికను భద్రంగా అప్పగించారు!
కవ్వింపు చర్యలతో సరిహద్దులో అలజడి సృష్టించే పాకిస్థాన్ భద్రతా దళాలు కాస్త కనికరం ప్రదర్శించాయి. తల్లి తిట్టిందని నియంత్రణ రేఖ దాటి తమ భూభాగంలో అడుగుపెట్టిన ఓ కాశ్మీరీ బాలికను క్షేమంగా ఆమె కుటుంబానికి అప్పగించాయి. యూరి పట్టణానికి సమీపంలోని సౌరా గ్రామంలో నివసించే నస్రీనా బానో అనే 16 ఏళ్ల బాలిక గత శుక్రవారం నాడు పాక్ లో ప్రవేశించింది. తల్లి తిట్టిందన్న కారణంతో బాలిక ఇల్లు విడిచింది. బాలికను గుర్తించిన పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివరాలు తెలుసుకున్న పిదప భారత సైన్యాధికారులతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి బాలికను కుటుంబానికి అప్పగించాలని నిర్ణయించారు. కమాన్ పోస్టు వద్ద సోమవారం నాడు నస్రీనా బానోను భద్రంగా తల్లిదండ్రులకు అప్పగించారు. దీనిపై బాలిక బంధువు మహ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ, ఇటీవల వరదల కారణంగా సరిహద్దు ప్రాంతంలోని కంచె దెబ్బతిన్నదని, అందువల్లే ఎందరో పొరబాటున పాక్ భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపాడు.