: 'పీకే'ను వ్యతిరేకిస్తున్న వారు స్వేచ్ఛగా కోర్టుకు వెళ్లవచ్చు: కేంద్ర సమాచార శాఖ
నటుడు అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రాన్ని అడ్డుకోవడం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిమితికి మించి చేయడమేనని ఆ శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ఎవరైతే ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారో... వారు స్వేచ్ఛగా కోర్టుకు వెళ్లవచ్చని చెప్పారు. ఏ సినిమానైనా చూడకుండా అడ్డుకునే న్యాయపరమైన హక్కు సమాచార శాఖకు లేదని ఆయన వివరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిందని రాజ్యవర్థన్ గుర్తు చేశారు. 'పీకే' సినిమాపై దేశ వ్యాప్తంగా భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి స్పందించారు.