: కొత్త బ్రౌజర్ తో సవాల్ విసరనున్న మైక్రోసాఫ్ట్!
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్... ఒకప్పుడు బాగా వెలిగిన బ్రౌజర్! కాలక్రమంలో గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ దాటికి కుదేలైంది. మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఎక్స్ ప్లోరర్ ను ఇప్పుడు వినియోగిస్తున్న వాళ్లు దాదాపు ఉండకపోవచ్చు. అంతలా వెనకబడిపోయింది. అందుకే, ఆ బ్రౌజర్ కు సమాధి కట్టాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. దానిస్థానంలో కొత్త విండోస్ బ్రౌజర్ ను తీసుకువస్తారట. దీని సాయంతో ప్రత్యర్థులకు సవాల్ విసిరేందుకు మైక్రోసాఫ్ట్ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఈ బ్రౌజర్ ను 'స్పార్టన్' అనే కోడ్ నేమ్ తో వ్యవహరిస్తున్నారు. ఇది క్రోమ్, ఫైర్ ఫాక్స్ తరహాలోనే ఉంటుందని టెక్ వర్గాలంటున్నాయి. మైక్రోసాఫ్ట్ చక్రా జావా స్క్రిప్ట్, ట్రైడెంట్ ఇంజన్ల ఆధారంగా ఈ బ్రౌజర్ పనిచేస్తుంది. ఈ బ్రౌజర్ లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ఛాయలు కనిపించకుండా మైక్రోసాఫ్ట్ అన్ని జాగ్రత్తలు తీసుకుందట.