: మోదీ కేబినెట్ కు న్యూ ఇయర్ వేడుకలు లేనట్లే!
నూతన సంవత్సర వేడుకలకు దేశం యావత్తు సమాయత్తమవుతోంది. నేటి రాత్రి మొదలుకానున్న వేడుకలు రేపటి ఉదయం దాకా నిర్విఘ్నంగా కొనసాగనున్నాయి. దేశ ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సంబరాల్లో మునిగిపోతే, కేంద్ర కేబినెట్ మాత్రం న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆయన కేబినెట్ సహచరులు నేడు (డిసెంబర్ 31), రేపు (జనవరి 1) తమ కార్యాలయాల్లోనే ఉండనున్నారు. తమకు కేటాయించిన విధుల్లో నిమగ్నం కానున్నారు. సుపరిపాలన పేరిట ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు న్యూ ఇయర్ నాడు 20 గంటల పాటు పని చేసేందుకూ సిద్ధమని కొందరు మంత్రులు చెబుతున్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీ కూడా ఈ రెండు రోజులూ తన కార్యాలయంలోనే ఉండనున్నారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు నిర్వహించే ఏ తరహా కార్యక్రమానికీ హాజరు కారాదని మంత్రులకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు తమ పర్యటనలను రద్దు చేసుకుని మరీ విధులకు హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రులు మహేష్ శర్మ, అశోక్ గజపతిరాజులు పీఎంఓ ఆదేశాలను నిర్ధారించారు. గడచిన పదేళ్లుగా తానెప్పుడూ న్యూ ఇయర్ వేడుకల్లో పాలుపంచుకోలేదని, తనకు కేటాయించిన విధుల్లోనే గడిపానని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.