: కప్పట్రాళ్ల కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడు అరెస్ట్
కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న దివాకర్ నాయుడును కర్నూలు పోలీసులు గత రాత్రి హుబ్లీ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకుని కర్నూలుకు తరలిస్తున్నారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసును సుదీర్ఘంగా విచారించిన ఆదోని కోర్టు ఇటీవలే తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవిత ఖైదుపడ్డ నిందితుల్లో దివాకర్ నాయుడు కూడా ఉన్నాడు. విచారణ కొనసాగుతున్నంతకాలం అతడి అరెస్ట్ పై అంతగా దృష్టి సారించని పోలీసులు, తుది తీర్పు వెలువడిన అనంతరం రంగంలోకి దిగారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలుగా విడిపోయిన కర్నూలు పోలీసులు హుబ్లీ రైల్వే స్టేషన్ లో ఉన్న దివాకర్ నాయుడిని అరెస్ట్ చేశారు.