: జమ్మూ కాశ్మీర్ లో బీజేపీనే కింగ్ మేకర్: రామ్ మాధవ్
జమ్మూ కాశ్మీర్ లో బీజేపీనే కింగ్ మేకర్ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పునరుద్ఘాటించారు. మంగళవారం గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలిసిన అనంతరం మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తమ ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యే సమస్యే లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రెండు పార్టీలు రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలిసినప్పటికీ తమ ప్రమేయం లేకుండా సర్కారు ఏర్పాటు దుర్లభమేనని ఆయన సూత్రీకరించారు. గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పిన రామ్ మాధవ్, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలేమీ జరపలేదని పేర్కొన్నారు. అయితే గవర్నర్ తో రామ్ మాధవ్ దాదాపు 40 నిమిషాల సేపు మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. మాధవ్ వెంట రాజ్ భవన్ వెళ్లిన బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ జుగల్ కిశోర్ మాత్రం ఈ చర్చల్లో పాల్గొనలేదట. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలక చర్చే జరిగి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.