: వచ్చే ఏడాది నుంచి హర్యానా పాఠశాల సిలబస్ లో భగవద్గీత!
హర్యానాలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ, ఆ రాష్ట్ర విద్యా ప్రణాళికలో భారీ మార్పులకు తెర తీయనుంది. వచ్చే ఏడాది నుంచి ఆ రాష్ట్ర పాఠశాల సిలబస్ లో భగవద్గీత చేరనుంది. ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు గల సిలబస్ లో గీతను చేర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రామ్ విలాస్ శర్మ సోమవారం ప్రకటించారు. భగవద్గీతను ‘‘సంస్కృతి, సమాజంలో మానవ విలువలకు ఆధారం’’గా ఆయన అభివర్ణించారు. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిల మధ్య సంభాషణల సారంగానే కాక జ్ఞానానికి సర్వోన్నతమైన ఆధారం భగవద్గీత అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఒక్క భారత్ మాత్రమే కాక ప్రపంచం మొత్తం అంగీకరించిందని కూడా ఆయన స్పష్టం చేశారు. పాఠశాల సిలబస్ లో భగవద్గీతలోని ఏఏ అంశాలను చేర్చాలన్న అంశంపై విద్యావేత్తలతో కూడిన ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే, హర్యానా సర్కారు చర్య రాజ్యాంగవిరుద్ధమని పంజాబ్ వర్సిటీ ఆచార్యుడు మంజీత్ సింగ్ అన్నారు. ఈ విషయంలో జగదీష్ ఖట్టర్ సర్కారు చర్యను స్వాగతిస్తున్నామన్న హర్యానా కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వర్, ఈ విషయంలో బీజేపీ వైఖరిని మాత్రం నమ్మలేమని వ్యాఖ్యానించారు.