: రేపు మా ఆవిడ విక్రమ్ లా తయారవమంటుందేమో!: సల్మాన్ ఖాన్
తమిళ హీరో విక్రమ్ ను గుర్తు పట్టాలంటే తనకు కనీసం ఐదు నిమిషాలు పడుతుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ముంబైలో 'బిగ్ బాస్' రియాలిటీ షోలో 'ఐ' సినిమా ప్రమోషన్ కోసం విక్రమ్ వచ్చిన సందర్భంగా సల్లూ భాయ్ మాట్లాడుతూ, తన మిత్రుడు విక్రమ్ ప్రతి సినిమాకీ తనను తాను మార్చుకుంటాడని అన్నాడు. తనకు వరుసగా ఫ్లాపులు వస్తున్నప్పుడు తీసిన 'తేరే నామ్' సినిమా మాతృక విక్రమ్ నటించిన 'సేతు' అని తెలిపాడు. తామిద్దరం మంచి మిత్రులమని సల్మాన్ పేర్కొన్నాడు. విక్రమ్ అలా ఎలా మారతాడోనని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దానికి విక్రమ్ సమాధానమిస్తూ "మీరిలా అంటున్నారు, మా ఆవిడేమో మీలా తయారవమంటోంది" అన్నాడు. దానికి సల్లూ భాయ్ సమాధానమిస్తూ "రేపు పెళ్లయితే మా ఆవిడ కూడా విక్రమ్ లా తయారవమంటుందేమో!" అనడంతో 'బిగ్ బాస్' హౌస్ లో నవ్వులు వెల్లివిరిశాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజయ్యే 'ఐ' సినిమాను అందరూ చూడాలని సల్మాన్ సూచించాడు.