: ఆ విషయం గుర్తించే ధోనీ తప్పుకున్నాడు: గవాస్కర్
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పడంపై మాజీ సారథి సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని సమర్థించాడు. మెల్బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదన్నాడు. ధోనీ మునిగిపోతున్న నావను వదిలిపెట్టి వచ్చేశాడన్న విమర్శలను గవాస్కర్ తోసిపుచ్చాడు. "ఇలాంటి వాదనలను నేను అంగీకరించను. నేనూ కెప్టెన్ గా వ్యవహరించాను. భారం పెరిగిపోయిన దశలో ఈ నిర్ణయం తప్పేమీకాదు. విరాట్ కోహ్లీ నాయకత్వ పగ్గాలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడన్న విషయం ధోనీ గుర్తించాడు. ఈ క్రమంలో సరిగానే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు" అని సన్నీ పేర్కొన్నాడు. కెప్టెన్ కు అవసరమైన పరిణతిని కోహ్లీ సాధించాడన్న విషయం గుర్తెరిగిన తర్వాతే ధోనీ తన నిర్ణయాన్ని తెలిపాడని వివరించాడు. కాగా, కెరీర్ లో మొత్తం 90 టెస్టులు ఆడిన ధోనీ 60 మ్యాచ్ లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. అతని సారథ్యంలో టీమిండియా 27 మ్యాచ్ లు గెలిచింది. 18 మ్యాచ్ లలో ఓటమిపాలవగా, 15 టెస్టులు డ్రా అయ్యాయి.