: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి


తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం టీటీడీ చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కోయల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. శ్రీవారి గర్భగుడి, కులశేఖరపడి, బంగారు వాకిలి ప్రాంగణాలను శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన చూర్ణాన్ని ఆలయగోడలకు పూశారు. ఆలయ ద్వారాలకు అలంకరించడానికి తయారుచేసిన పరదాలను ఈవో సాంబశివరావు ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామి సన్నిధిలో అప్పగించారు. ఆలయాన్ని ప్రత్యేక విద్యుద్దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కాగా, వైకుంఠ ఏకాదశి కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశదర్శనం, దివ్యదర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి సేవకులందరూ హిందూ ధర్మానికి కార్యకర్తల్లా పనిచేయాలని ఈ సందర్భంగా ఈవో సూచించారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశినాడు అర్థరాత్రి నుంచి వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయని, ఏకాదశి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు రేపు మధ్యాహ్నం నుంచి క్యూలైన్లోకి అనుమతి ఇస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News