: ధోనీ ఆకస్మిక రిటైర్మెంట్ వెనుక కారణమేంటి?


మహేంద్ర సింగ్ ధోనీ ఆకస్మిక రిటైర్మెంట్ వెనుక కారణమేంటి? అనేది క్రికెట్ అభిమానులందరినీ తొలుస్తున్న ప్రశ్న. సాధారణంగా దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందిన క్రికెటర్లు ఫామ్ లేమి, గాయాలు, జీవితంలో ఆటుపోట్లు, పెరిగిన వయసు వంటి విషయాలు బాధిస్తే కానీ రిటైర్మెంట్ ప్రకటించరు. అయినప్పటికీ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వరల్డ్ కప్ సమీపిస్తున్న దశలో ధోనీ నిర్ణయం వన్డే ఫార్మాట్లో టీమిండియాకు లాభించే అంశం. టెస్టు క్రికెట్ భారాన్ని దించుకున్న ఈ జార్ఖండ్ డైనమైట్ వన్డేల్లో తాజాగా బరిలో దిగేందుకు వీలవుతుంది. అయితే, ధోనీ నిర్ణయం టెస్టుల్లో టీమిండియాపై ప్రభావం చూపనుంది. అతనిలాంటి అనుభవశాలి లేకుండానే ఇకపై యువ జట్టు ఆడాల్సి ఉంటుంది. ఈ దశలో, ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్టులు ఆడేసరికి మిస్టర్ కూల్ ను రిటైర్మెంట్ దిశగా లాగిన పరిస్థితులు ఏమిటన్న విషయాలను పరికిస్తే... రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ గా ధోనీ వరుసగా సెలవులు తీసుకుంటుండడంపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి బాధ్యతలను పక్కనపెట్టి లీవ్ కావాలనడం ఎంతవరకు సబబు? అంటూ బీసీసీఐని వెటరన్ లు నిలదీస్తున్నారట. మరోవైపు ధోనీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో కేవలం కాగితం పులులనే పేరును నిలబెట్టుకుంటూ వరుసగా విఫలమవుతూ వస్తోంది. దీంతో గవాస్కర్, గంగూలీ, మంజ్రేకర్ వంటి సీనియర్లు ధోనీకి రిటైర్మెంట్ సలహా ఇచ్చారు. ధోనీ రిటైర్ అయితే జూనియర్లకు అవకాశం వస్తుందని వారు స్పష్టం చేశారు. కాగా, ముందు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, వరల్డ్ కప్ తరువాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే సరిపోతుందనేది ధోనీ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే, అన్ని విధాలా మేలని భావించే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో ఇంత హడావుడిగా ధోనీ రిటైర్ కావాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News