: తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించండి: గవర్నర్ ను కోరనున్న టీ టీడీపీ
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీటీడీపీ కారాలు మిరియాలు నూరుతోంది. నిన్నటిదాకా తమతో ఉండి, నేడు టీఆర్ఎస్ లో చేరీ చేరగానే మంత్రి పదవి సాధించుకున్న ఆయనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అపాయింట్ మెంట్ తీసుకున్న టీటీడీపీ నేతలు మరికొద్దిసేపట్లో రాజభవన్ లో ఆయనను కలవనున్నారు. తమ పార్టీ టికెట్ పై విజయం సాధించి, టీఆర్ఎస్ కేబినెట్ లో మంత్రి పదవి ఎలా తీసుకుంటారంటూ టీటీడీపీ నేతలు తలసానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాక తక్షణమే తలసానిని కేబినెట్ నుంచి తొలగించాలని కూడా వారు గవర్నర్ ను కోరనున్నారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందుగానే సనత్ నగర్ ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి తలసాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవికి తలసాని చేసిన రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు.