: టీమిండియా విజయ లక్ష్యం 384... 318 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్!


మూడో టెస్టులో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ను 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 384 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐదో రోజు ఆటలో భాగంగా లంచ్ విరామం దాకా బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్, భారీ స్కోరు దిశగా పయనించింది. నాలుగో రోజు బ్యాటింగ్ కు వచ్చిన షాన్ మార్ష్ ఐదో రోజు కూడా బ్యాట్ ఝుళిపించి సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్ సెంచరీ చేయగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయాలని భావించిన ఆసిస్, మార్ష్ ఔటైన తర్వాత మరో వికెట్ మిగిలి ఉండగానే తన నిర్ణయాన్ని అమలు చేసింది. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాన్ మార్ష్ రనౌటయ్యాడు. టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మార్ష్ ను ఔట్ చేశాడు. దీంతో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తూ ఆసీస్ ప్రకటించింది. ఇక 384 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగనున్న టీమిండియాకు 70 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. 70 ఓవర్లు ముగిసినా, ఫలితం తేలే అవకాశం ఉంటే, మరో 15 ఓవర్ల దాకా (మ్యాండేటరీ ఓవర్లు) మ్యాచ్ ను పొడిగించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News