: జనవరి 6న యానాంలో సుశీలమ్మకు సన్మానం
సినీ గాయకులంతా సుశీలమ్మగా పిలుచుకునే నేపథ్యగాయని పి.సుశీలకు యానాంలో సన్మానం చేయనున్నారు. జనవరి 6 నుంచి 8 వరకు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పి.సుశీలతో పాటు సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్, శుభలేఖ సుధాకర్, డాక్టర్ జి.సమరం, మీలో ఎవరు కోటీశ్వరుడులో పాల్గొన్న యానాం ఉపాధ్యాయుడు ఉమాకాంత్ లను సత్కరించనున్నామని ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తెలిపారు. ప్రజా ఉత్సవాల్లో ఫల, పుష్ప ప్రదర్శనలను ప్రారంభించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్, ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రులు త్యాగరాజన్, రాజవేలు తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు. జనవరి 6 ఉదయం యానాం టవర్ ను, మధ్యాహ్నం అగ్నికులక్షత్రియ కల్యాణమండపాలను సీఎం ప్రారంభించనున్నారని, ప్రభుత్వ పాలిటెక్నిక్ నూతన భవనాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారని ఆయన వివరించారు.