: 'పీకే' వివాదం: అహ్మదాబాద్ లో థియేటర్లు ధ్వంసం


బాలీవుడ్ చిత్రం 'పీకే'పై నిషేధం విధించాలంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్ విధ్వంసానికి దారి తీసింది. అహ్మదాబాద్ లో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ప్రముఖ థియేటర్లపై ఆందోళనకారులు దాడి చేశారు. 20 మంది భజరంగ్ దళ్ సభ్యులు స్థానికంగా ఉన్న సిటీ గోల్డ్, శివ్ థియేటర్లను లక్ష్యంగా చేసుకున్నారు. టికెట్ విండోలను పగలకొట్టి, సినిమా పోస్టర్లను చించివేశారు. విషయం తెలుసుకున్న నవరంగ్ పుర పోలీసులు ఘటన స్థలానికి వచ్చేలోపలే దాడికి పాల్పడిన వారు పారిపోయారు. అయితే, థియేటర్లపై దాడి జరుగుతుండగా తీసిన వీడియోలో వారంతా కెమెరాకు చిక్కారని, తప్పకుండా గుర్తిస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మరోవైపు, భోపాల్లోనూ ఈ సినిమాను నిలిపివేయాలంటూ నిరసనలు జరగ్గా, 'పీకే' ప్రదర్శనలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News