: అరుణగ్రహంపై ఏలియన్ శవపేటిక?
అప్పట్లో ఫ్లయింగ్ సాసర్లకు సంబంధించి ఎన్నో వార్తలు వచ్చేవి. అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ) లని వాటికి నామకరణం కూడా చేశారు. తాము వాటిని చూశామని కొందరు చెప్పేవారు. కానీ, కచ్చితమైన ఆధారాలు మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు. ఔత్సాహికులు మాత్రం వాటి కోసం, ఏలియన్ల కోసం అన్వేషించడం మానలేదు. తాజాగా, యూట్యూబ్ లో పోస్టయిన ఓ వీడియోలో అంగారకుడిపై ఓ శవపేటిక వంటి ఆకృతి దర్శనమివ్వడం ఆసక్తిగొలుపుతోంది. దగ్గరి నుంచి చూస్తే తప్ప అందులోని శవపేటిక వంటి శిల కనిపించడంలేదని 'ఇంక్విజిటర్' వెబ్ సైట్ పేర్కొంది. ఈ రాతి ఆకారం ఓ శవపేటికలా కనిపిస్తోందని యూఎఫ్ఓలపై పరిశోధనలు చేస్తున్న స్కాట్ వారింగ్ తెలిపారు. నాసా తన క్యూరియాసిటీ రోవర్ ను ఈ రాతి వైపు మళ్లిస్తే ఆసక్తికర సమాచారం వెల్లడవుతుందని అన్నారు.