: పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం మా శాఖపై ఉంటుంది: తలసాని
బంగారు తెలంగాణ నిర్మాణంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ శాఖను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతో, దాని ప్రభావం తమ శాఖపై ఉంటుందని తెలిపారు. నిజాయతీగా ఉన్న వ్యాపారులకు అండగా ఉంటామని... అనవసరంగా వ్యాపారులను ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని తలసాని చెప్పారు. అధికారులు కూడా నిజాయతీగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ రోజు తన శాఖకు చెందిన అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన పై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ప్రతినెల రూ. 50 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని... అయితే, దానికి తగ్గట్టు పన్నులు మాత్రం వసూలు కావడం లేదని అన్నారు.