: ఆసీస్ ఆధిక్యం 326... ఇక బ్యాట్స్ మెన్ పైనే భారం!
మెల్బోర్న్ టెస్టులో భారత్ ను గట్టెక్కించే భారం ఇక బ్యాట్స్ మెన్ పై నిలిచింది. నాలుగో రోజు ఆట చివరికి ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 261 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 326 పరుగులు కాగా, చేతిలో 3 వికెట్లున్నాయి. ఆసీస్ కెప్టెన్ స్మిత్ మంగళవారం ఉదయం వీలైనంత త్వరగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి భారత్ ను బ్యాటింగ్ కు దింపే అవకాశం ఉంది. మూడొందల పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండడంతో, టీమిండియా గత రికార్డు దృష్ట్యా మరో ఓటమి ఖాయమేనన్నది క్రికెట్ పండితుల అభిప్రాయం! అంతకుముందు, నాలుగో రోజు ఉదయం 462/8 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తన మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా మరో 3 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. ఆ రెండు వికెట్లు జాన్సన్ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో, 465 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో హ్యారిస్ 4, జాన్సన్ 3, లియాన్ 2 వికెట్లు తీశారు. వాట్సన్ కు ఓ వికెట్ దక్కింది. అనంతరం, 65 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ దూకుడుకు ప్రాధాన్యం ఇచ్చింది. విధ్వంసక ఓపెనర్ వార్నర్ 40 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోజర్స్ 69 పరుగులు సాధించాడు. వీరిద్దరినీ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఇక, తొలి ఇన్నింగ్స్ లో పరుగులు వెల్లువెత్తించిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (14) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. స్మిత్ వికెట్ యాదవ్ కు దక్కింది. అంతకుముందు వాట్సన్ (17)ను ఇషాంత్ బలిగొన్నాడు. అయితే, మిడిలార్డర్లో షాన్ మార్ష్ (62 బ్యాటింగ్) రాణించడంతో ఆసీస్ ఆధిక్యం 300 మార్కు దాటింది. ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆటకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది.