: భారత సంతతి పేసర్ కు పాంటింగ్ మద్దతు
ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. ఈ మెగా ఈవెంట్ కు ఎంపిక చేసే జట్టు కోసం ఆసీస్ సెలక్టర్లు భారీ కసరత్తే చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన ఆలోచనలు వెల్లడించాడు. ముగ్గురు బౌలర్లు మాత్రం కచ్చితంగా వరల్డ్ కప్ జట్టులో ఉండాలంటున్నాడు. పాంటింగ్ పేర్కొంటున్న త్రయంలో భారత సంతతి ఫాస్ట్ బౌలర్ గురీందర్ సింగ్ సంధు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరూ జాసన్ బెరెండాఫ్, ఆస్టన్ అగర్. సంధు గురించి చెబుతూ, అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ కు సంబంధించి నికార్సైన బౌలర్ అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టీ20 క్రికెట్ చివరి ఓవర్లలో సంధు మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. ఆసీస్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ డెత్ ఓవర్లలో పరుగులు భారీగా సమర్పించుకుంటోందని, ఈ నేపథ్యంలో సంధు ఎంపిక లాభిస్తుందని అన్నాడు. ఇక, బెరెండాఫ్, అగర్ కూడా ప్రతిభావంతులేనని తెలిపాడు.