: శారదా స్కాం నిందితుడికి జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్
శారదా చిట్ ఫండ్ స్కాంలో నిందితుడు, పశ్చిమ బెంగాల్ రవాణా, క్రీడల మంత్రి మదన్ మిత్రా జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్ పొందుతున్నారు. స్కాంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే. అయితే, అనారోగ్యంతో ఆయన కోల్ కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయనకు టీ, స్నాక్స్ తో అలీపూర్ సెంట్రల్ జైలు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనకు శ్వాస సరిగా ఆడడంలేదని చెప్పడంతో పరీక్షించిన జైలు డాక్టర్ వెంటనే మంత్రిని జైలు హాస్పిటల్ కు తరలించాలని సూచించారు. దీంతో, మిత్రాను జైలు హాస్పిటల్లోని ప్రత్యేక వార్డుకు తరలించారు. మంత్రిగారి రాకతో చికిత్స పొందుతున్న ఖైదీలను అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేశారు. అక్కడ ఆయన కోసం నలుగురు ఖైదీలను పనివాళ్లుగా నియమించారు. కొత్త పరుపు, దిండ్లు, ఏకాంతం కోసం కర్టెన్లు ఏర్పాటు చేశారు. ఇక, అమాత్యుడి కోసం ప్రత్యేకంగా వండివార్చారట. ఇప్పుడాయన కోసం జైల్లో ఓ ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నారు. ఇక, మంత్రిగారు తన కోసం వచ్చే సందర్శకులను నేరుగా జైలు సూపరింటిండెంట్ కార్యాలయంలోనే కలుసుకుంటుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్ విపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నారని, విచారణకు అవసరమైన ఫిట్ నెస్ పొందారని ఎస్ఎస్కేఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించినా, ఆయన జైలు హాస్పిటల్లో చేరడంపై విమర్శించాయి.