: రజనీకాంత్ కు 'నో' చెప్పిన అమిత్ షా!


సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఎలాగైనా బీజేపీలో చేర్చుకుని... తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న బీజేపీ పెద్దలు తమ మనసును మార్చుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న బీజేపీకి... తమిళనాడులో పాగా వేయడానికి ఇదే సరైన సమయంగా ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతో పాప్యులారిటీ ఉన్న రజనీ తమతో జత కలిస్తే, ఎన్నికల్లో తిరుగుండదని మోదీ, అమిత్ షా లాంటి నేతలు అంచనా వేశారు. ఈ క్రమంలో, ఇప్పటికే రజనీతో బీజేపీ అధిష్ఠానం పలుమార్లు చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇటీవల 'లింగ' సినిమా షూటింగ్ సమయంలో రజనీని బీజేపీ సీనియర్ నేత యెడ్యూరప్ప వ్యక్తిగతంగా కలిశారు. అదే సమయంలో, అమిత్ షా కూడా రజనీతో ఫోన్ లో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సైతం రజనీని అతని నివాసంలో కలిసి పార్టీలో చేరికపై మాట్లాడారు. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి మీరేనంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే, లింగ సినిమా విడుదలయిన తర్వాత చూద్దామంటూ అప్పట్లో రజనీ కొంతమేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, బీజేపీలో రజనీ చేరిక ఖాయమని అందరూ భావించారు. అయితే, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. బెయిల్ పై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయటకు వచ్చిన వెంటనే, ఆమెకు రజనీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో, కంగుతినడం బీజేపీ నేతల వంతయింది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై వచ్చిన అమిత్ షా రజనీ అంశంపై కూడా పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. తాను మరోసారి చెన్నై రాకముందే రజనీ తన నిర్ణయాన్ని తెలపాలని కోరారు. అయితే, సూపర్ స్టార్ మాత్రం మరోసారి సాగతీత ధోరణిని అవలంబించారు. నాలుగు నెలలు ఓపిక పట్టండి అంటూ రజనీ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చిర్రెత్తుకొచ్చింది. అప్పట్లో జయ కేసు విషయం చివరి అంకానికి చేరింది కాబట్టి, సమయం అడగడంలో తప్పులేదని... ఇప్పుడు మళ్లీ సమయం కావాలని కోరడంలో అర్థం లేదని అమిత్ షా అన్నారట. ఇబ్బందికర పరిస్థితుల్లో బీజేపీలోకి రజనీకాంత్ రావాల్సిన అవసరం లేదని అమిత్ కుండబద్దలు కొట్టారట. బీజేపీలో మోదీ తర్వాత నెంబర్ టూ అయిన అమిత్ షానే ఈ అభిప్రాయానికి రావడంతో, ఇక బీజేపీలోకి రజనీ చేరిక అసంభవమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News