: నేడు బెజవాడకు కేంద్ర మంత్రి సుజనా... కేశినేని, దేవినేనిల మధ్య సయోధ్యే లక్ష్యం!


కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేడు విజయవాడ పర్యటనకు వెళుతున్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య సయోధ్య కుదర్చడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ అభివృద్ధికి సంబంధించి మంత్రి తమను ఏమాత్రం సంప్రదించడం లేదని నాని మూడు రోజుల క్రితం బహిరంగ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. దీంతో నానితో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడారు. బహిరంగ వ్యాఖ్యలు సబబు కాదని, ఏదైనా ఉంటే తన వద్దకు నేరుగా రావాలని ఈ సందర్భంగా చంద్రబాబు, నానికి సూచించారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ నాని నిన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేశినేని, దేవినేనిల మధ్య రాజీ కుదిర్చి రావాలని చంద్రబాబు, సుజనాకు సూచించారు. దీంతో నేడు విజయవాడకు వెళ్లనున్న సుజనా, వారిద్దరితో విడివిడిగానే కాక కలివిడిగానూ చర్చలు జరుపుతారని విశ్వసనీయ సమాచారం. సుజనాను రాయబారిగా పంపుతున్నట్లు చంద్రబాబు తనతో చెప్పారని నాని స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేవినేని, కేశినేని వర్గాలు తమ వాదనలను సుజనా ముందు పెట్టేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసుకున్నాయి. మరి సయోధ్య కుదురుతుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News