: ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ బెంగళూరు... సిమీ పనేనంటున్న పోలీసులు!


భారత సిలికాన్ వ్యాలీగా ఖ్యాతిగాంచిన బెంగళూరు ఆదివారం ఉలిక్కిపడింది. నూతన సంవత్సరాది సమీపిస్తున్న తరుణంలో రద్దీ ప్రదేశం చర్చి స్ట్రీట్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఒక్క బెంగళూరే కాక దేశం యావత్తు ఉలిక్కిపడింది. తక్కువ తీవ్రతతో జరిగిన ఈ పేలుడులో ఓ మహిళ మృత్యువాతపడగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నగరంలో వారాంతాల్లో జనసమ్మర్ధం అధికంగా ఉండే చర్చి స్ట్రీట్ లో ఆదివారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కగా, పొదల్లో బాంబును అమర్చిన ఉగ్రవాదులు దానిని పేల్చేశారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన తమిళనాడుకు చెందిన మహిళ భవానీ దేవి (38) చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యుడు కార్తిక్ సహా, మరో ఇద్దరు గాయపడ్డారు. పేలుడు జరిగిన తీరును పరిశీలించిన బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి... సిమీ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తక్కువ తీవ్రతతో కూడిన బాంబు కావడంతో పెద్ద ముప్పు తప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఈడీ రకానికి చెందిన బాంబునే ఉగ్రవాదులు ఈ దాడికి వినియోగించారని ఆయన పేర్కొన్నారు. ఈ పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు బెంగళూరు సహా అన్ని నగరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News