: విమానం గాలింపు చర్యలు నిలిపివేత
జావా సముద్రంలోని బెలిటుంగ్ ప్రాంతంలో చీకట్లు కమ్ముకోవడంతో ఎయిర్ ఏషియా విమానం గాలింపు చర్యలను నిలిపివేశారు. దీంతో, ఇప్పటివరకు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న విమానాలు వెనుదిరిగాయి. గాలింపు చర్యలు రేపు ఉదయం కొనసాగుతాయి. అటు, విమానం కూలినట్టు వస్తున్న వార్తలను మలేసియా ఖండించింది. తూర్పు బెలిటుంగ్ ప్రాంతంలో శకలాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొంది. కచ్చితత్వం లేని కథనాలను పట్టించుకోవద్దని మలేసియా రవాణా మంత్రి లియో తియాంగ్ లాయ్ ప్రయాణికుల కుటుంబాలకు సూచించారు. ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళ్లే క్రమంలో ఈ ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానంలో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో 149 మంది ఇండోనేసియన్లు కాగా, ముగ్గురు దక్షిణకొరియన్లు. ఇక, బ్రిటన్, మలేసియా, సింగపూర్ దేశాలకు చెందిన ఒక్కో పౌరుడు ఉన్నారు. ప్రయాణికుల్లో 16 మంది చిన్నారులు, ఓ శిశువు ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ విమానం కూలిపోయి ఉంటుందని వార్తలు వస్తుండడం తెలిసిందే.