: నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: విజయవాడ ఎంపీ కేశినేని నాని
ప్రజా ప్రతినిధులకు అధికారులు సహకరించడం లేదన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. అంతేకాక గడచిన ఆరు నెలల్లో విజయవాడకు ఒరిగిందేమీ లేదని కూడా ఆయన చెప్పారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన నాని ఈ మేరకు ప్రకటించారు. అధికారులతో పాటు సొంత పార్టీకి చెందిన మంత్రి దేవినేని ఉమపై చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో చివాట్లు తిన్న నాని, తన వ్యాఖ్యలో ఏమాత్రం అవాస్తవం లేదని ప్రకటించడం గమనార్హం. విలేకరుల సమావేశంలో భాగంగా ఆయన పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునే రీతిలో చంద్రబాబు పనితీరుపై పొగడ్తల వర్షం కురిపించారు. అధికారుల వైఖరిపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు చెప్పిన ఆదేశాలను భవిష్యత్తులో పాటిస్తానని నాని ప్రకటించారు. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.