: బాంబు పెట్టానంటూ ఉత్తుత్తి బెదిరింపు కాల్...పాకిస్థానీకి 26 ఏళ్ల జైలు శిక్ష
తాను పెట్టిన ఓ బాంబు మరికొద్ది సేపట్లో పేలుతోందంటూ పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తికి 26 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ కు చెందిన కోర్టు తీర్పు చెప్పింది. ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడ్డ యూసుఫ్ రాణా అనే వ్యక్తికి జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ నగరంలో రద్దీగా ఉండే చిల్డ్రన్స్ పార్కులో బాంబు పెట్టానంటూ రాణా పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో బాంబు డిస్పోబుల్ స్వ్కాడ్ రంగంలోకి దిగి సోదాలు చేసింది. అయితే ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాణాను నిందితుడిగా గుర్తించారు. వెనువెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా, రాణా కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన స్నేహితుడి ఫోన్ నుంచే సదరు కాల్ చేశానని అంగీకరించాడు. స్నేహితుడితో తనకు తలెత్తిన గొడవ నేపథ్యంలో అతడి సెల్ నుంచి ఫోన్ చేసి అతడిపై పగ తీర్చుకోవాలని పథకం వేసినట్లు చెప్పుకొచ్చాడు. కేసును విచారించిన కోర్టు రాణాకు 26 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానాను విధించింది.