: కన్నీరుపెట్టుకున్న రష్యా కూచిపూడి కళాకారిణి
కళాకారులను సత్కరిస్తున్న నేలపై విదేశీ కళాకారిణి కన్నీరుపెట్టుకుంది. హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరుగుతున్న నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనంలో పాల్గొనేందుకు రష్యాకు చెందిన అలీఫా కుచ్ తోవా అనే కళాకారిణి ఇండోర్ స్టేడియంకు వచ్చారు. పాస్ పోర్టు, గుర్తింపు కార్డులు, డబ్బు ఉన్న బ్యాగును మేకప్ రూమ్ లో పెట్టి నాట్య ప్రదర్శనకు ఆమె వేదికపైకి వెళ్లారు. ప్రదర్శన ముగించుకుని వచ్చి మేకప్ రూమ్ లో బ్యాగ్ కోసం వెతకగా బ్యాగ్ కనిపించలేదు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం వివరించారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.